Pages

Thursday, August 15, 2013

ఆధునిక పద్య కవితకు మకుటంలేని పీష్వా గుఱ్ఱం జాషువా

ఆధునిక పద్య కవితకు మకుటంలేని పీష్వా గుఱ్ఱం జాషువా
-డా|| రామడుగు వెంకటేశ్వరశర్మ
పాడుబడ్డ మసీదునే బడిగా చేసుకొని భాగ వతాది కావ్యాల్ని ఆసక్తితో చదివిన సాహితీ ఏకలవ్యుడు-గుఱ్ఱం జాషువా. గిజిగాళ్ళనూ, సాలీళ్ళనూ నిజమైన చెలులుగా భావించి తన ఖండ కావ్యాల్లో వాటిద్వారా మనం నేర్చుకోదగిన వింత లకూ, విశేషాలకూ ఎన్నింటినో తెలిపిన విశిష్టకవి- జాషువా. కుక్క పిల్లల నుండి గుడిలోని దేవుని వరకూ అన్నింటినీ కవితాత్మతో చూడకలిగిన కమనీయ కవి-జాషువా. శ్మశానాన్ని అస్పృశ్యతా శూన్యమైన సౌఖ్యనిలయంగా సంభావించిన అపూర్వకవి-జాషువా. ''ముసుగు లో గుద్దులాటలు పొసగవమనుజుంకు గొంకులు లేక నగ సత్యాలను బట్టబయలుగా వించిన దిట్ట కవి-జాషువా. చేదు బాధల చిగురుటాకుల్ని మేసి, మధురగాన మనే మధురకవిత్వము ఆలపించి, జగతిలో వసంతాన్ని సంతరింపచేసిన అచ్చమైన కవికోకిల-జాషువా. మానవతకు మణికిరీటాన్ని పెట్టిన మకుటంలేని పీష్వా-గుఱ్ఱం జాషువా.
మోదాన్నిగానీ, వేదననుగానీ తన స్వాదు కవితలతో ప్రకృతి గుండెలలోకి పంపే నేర్పు కలిగిన సుకవి-జాషువా. ''రాజు మరణించెనొక తార రాలిపోయె, కవియుమరణించెనొక తార గగనమెక్కె రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించె ప్రజల నాలుకలయందు-'' ''రాజు చేతి కత్తి రక్తంబువర్షించు, సుకవి చేతి కలము సుధలు కురియు--''ఇత్యాదిగా కవికి -రాజుకు గల తేడాలను జాషువా స్పష్టీకరించినట్లుగా మరొకరు వ్యక్తీకరించలేదన్నది పచ్చి నిజం. ఆయన ''శిశువు'' పద్యాల భావాలు ప్రపంచ సాహిత్యంలోనే స్థిరంగా నిలుస్తాయి అని విశ్వనాధవారే కితాబు నిచ్చారు- ''వృద్దవీరుడ! నీవయస్సెంత చెపుమ!'' ఇత్యాదిగా భీష్మాది పౌరాణిక పాత్రలను చనువుగా పలుకరించి నిర్మొహమాటంగా వారిలోని లోపా లోపాలను సంభాషణ శైలిలో వ్యక్తీకరించడంలోని జవమూ-జీవమూ జాషువాలో ఉన్నట్లుగా మరొకరిలో కానరావు.
అసలు-కర్ణుడికీ-జాషువాకు అవినాభావ సంబంధం వుంది. కుమారాస్త్రవిద్యా ప్రదర్శనలో కర్ణుడి కులాన్ని కృపాచార్యుడే ప్రశ్నిస్తే, కొందరు కవియైన జాషువా కులాన్ని ప్రశ్నించారు. కురుక్షేత్ర సమరంలో కర్ణుడికి భీష్ముడు అతిరథ స్థానాన్ని ఇవ్వలేదు. 'వైతాళికులు' కవితాసంకల నంలో జాషువాకు చోటివ్వలేదు. అర్జునునిపై ఎంగిలి బాణాన్ని వేయనన్నాడు- కర్ణుడు, ''రాని రాగము తీయలేని కవిని'' అన్నాడు-జాషువా. అతులిత సువర్ణమయకవచాఢ్యుడు- కర్ణుడు- జాషువా కూడా అర్థమయమైనసుచావర్ణంతో అలరాలినవాడే.
మరో విషయం: -పరమాత్ముని సృష్టిలోపలి గారడీని చూసి నిలదీసి ఆయన్ని ప్రశ్నించిన తీరూ, కులాన్ని కులంతో కొలిచే తులువ సంఘానికి సిలువ వేసే గడుసుదనమూ, వసుధైక కుటుంబ భావనా పరిమళాలతో జాతీయ నాయక ప్రసూనాలను తీర్చిదిద్దిన రీతీ, జిలిబిలి తెలుగు పలుకులలో అన్య భాషా పదాలను అందంగా ఒదిగిపోయేవిధంగా ప్రయోగించే ఆపటిమా- జాషువాకి ఉన్నట్లుగా ఎవరికి ఉన్నదో చెప్పండి?
జాషువా-రక్తంతో రంగరించి పిరదౌసి కృతిని నిర్మిస్తే-కన్నీళ్ళతో ముంతాజ్‌ మహల్‌ను కట్టారు. గార్హస్థ్యరాగాన్ని రాజసంగా వ్యక్తీకరించారు.- అందులో దాపరికం లేకుండా అనుభూతి ప్రధానంగా ''నా కథ''ను చెప్పారు. మానవత్వ కం'దళిత' మందిరం-ఆయన ''గబ్బిలం''. జాషువా ప్రధానంగా-ఆయనే తెల్పుకొన్నట్లుగా ''గాంధీశాంతి సిద్ధాంతమార్ధవమార్గాటుడు'' ''గబ్బిలంబులకు దౌత్యంబుల్‌ ప్రబోధించు మానవతాస్రష్ట. ఇంతకూ ఆయన కృతులన్నీ నవ్యభారతిసిగలోని నగలు.
ఇంతకీ ముత్యాలకై సముద్రంలో మునిగి బలియైన పిరదౌసి వంటి కవీశ్వరులలోనూ నిరుపేద రూపులై మొరపెట్టుకోవడానికి శివుని గుడి మూల చేరే గబ్బిలాలోనూ, కష్టజీవుల మేనిగండు చెమ్మటలూడ్చి ఓదార్చే పిల్లవాయువుల లోనూ, ఆలిచిప్పలకు ముత్యాల పాపలనిచ్చి కరిగే స్వాతిమేఘాలలోనూ, కష్టాల్లో కూడా తానునవ్వుతూ తోటి వారిని నవ్వించే వ్యక్తుల్లోనూ, అద్దెకూ- ముద్దకూ పెద్దలాడుకొంటూ ఉండగా గడిచే ఒడిదుడుకుల మనుగడలలోనూ గుఱ్ఱం జాషువాయే నేటికీ కనిపిస్తూ ఉంటారు. జాషువా నిజంగా చిరంజీవి.

http://www.visalaandhra.com సౌజన్యంతో 


0 comments:

Post a Comment